పక్కింటి వ్యక్తిని పెండ్లి చేసుకున్న కూతురు..
పక్కింటి వ్యక్తిని ప్రేమపెండ్లి చేసుకున్న కూతురుపై తల్లిదండ్రులు కోపం పెంచుకున్నారు. దీంతో పొరుగింటికి దారి లేకుండా సీసీరోడ్డుపై సిమెంట్ ఇంటుకలతో గోడకట్టిన ఘటన కరీంనగర్ (karimnagar) జిల్లాలో చోటుచేసుకున్నది.
జిల్లాలోని శంకరపట్నం మండలం ఎరడపల్లి గ్రామానికి చెందిన మమత తమ పొరుగింట్లో ఉండే కనకం రత్నాకర్‌ను గతేడాది ఫిబ్రవరి 16న ప్రేమ పెండ్లి చేసుకున్నది. అయితే వారి వివాహం మమత తల్లిదండ్రులకు ఇష్టం లేదు. దీంతో మమత, రత్నాకర్ దంపతులు కేశపట్నంలోని ఓ ఇంట్లో కిరాయికి ఉంటున్నారు. రత్నాకర్ తల్లిదండ్రులు మాత్రం ఎరడపల్లిలోనే నివసిస్తున్నారు.
కాగా, మమత తమ తల్లిగారి ఇంటి మీదుగానే రత్నాకర్ ఇంటికి వెళ్లాల్సి ఉంది. దీంతో రత్నాకర్ కుటుంబం ఆ దారిగుండా నడవకుండా మమత కుటుంబ సభ్యులు ఆరు నెలల క్రితం రోడ్డుపై అడ్డంగా సిమెంట్ ఇటుకలతో గోడ కట్టారు. ఈనేపథ్యంలో అప్పటి నుంచి దొడ్డిదారి గుండా వారు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే తన అత్తగారింటికి వెళ్లేందుకు దారి లేకుండా చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని, తన తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని నాలుగు రోజుల క్రితం కేశవపట్నం పోలీసుస్టేషన్‌లో మమత ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తమకు న్యాయం చేయాలని ఆమె కోరారు.