హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో మరమ్మత్తులు

0

హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పనులు ప్రారంభం అయ్యాయి. ఇటీవలే నిర్మించిన ఈ భవనానికి సిట్టింగ్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మరమ్మత్తులు చేయిస్తుండడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ భవనానికి వాస్తు బాగా లేకపోవడం వల్లే అపశృతులు చోటు చేసుకుంటున్నాయని భావించే అందుకు అనుకూలంగా మరమ్మత్తులు చేయిస్తున్నారన్న ప్రచారం అయితే సాగుతోంది.

ఈటల ఎఫెక్టేనా..?

హుజురాబాద్ నుండి అప్రతిహతంగా గెలుస్తున్న ఈటల రాజేందర్ ఈ క్యాంపు కార్యాలయంలోకి షిప్ట్ అయిన తరువాతే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారన్న వాదన స్థానికంగా వినిపిస్తోంది. కొత్తగా నిర్మించిన ఈ భవనంలోకి మారిన తరువాత మంత్రివర్గంలో స్థానం కోసం ఊగిసలాడడం, ఆ తరువాత పార్టీ నుండి బయటకు రావడం, ఉప ఎన్నికలకు వెల్లడం, జనరల్ ఎన్నికల్లో ఓటమి పాలు కావడం వంటి చర్యలు అన్ని కూడా క్యాంప్ ఆఫీసుకు వాస్తు లేకపోవడమేనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సమీపంలో విద్యుత్ సబ్ స్టేషన్ ఉండడంతో పాటు భవనంలోని డోర్లు ఏర్పాటు చేయాల్సిన చోట చేయకపోవడం వల్ల ఇందులో నివసించే వారికి భవిష్యత్తులో ఆటంకాలు ఎదురవుతాయన్న వాదనలు బలంగా వినిపించాయి. దీంతో ఈ సారి ఎన్నికల్లో గెలిచిన కౌశిక్ రెడ్డి క్యాంప్ ఆఫీసు నుండి కార్యకలాపాలు కొనసాగించేందుకు మీనామేషాలు లెక్కించారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఈ క్రమంలోనే హుజురాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు భవనంలోనే మరమ్మత్తులు ప్రారంభం కావడం గమనార్హం. భవనాన్ని వాస్తుకు అనుగుణంగా సెట్ చేసిన తరువాత సిట్టింగ్ ఎమ్మెల్యే గృహ ప్రవేశం చేయనున్నట్టు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com