ఫ్రీ బస్సు పుణ్యమా అని మంచి గిరాకీ!.. బస్సులోనే కూరగాయల దుకాణం తెరిచిన మహిళ

0

తెలంగాణలో మహిళలకు ఫ్రీ బస్సు సౌకర్యం కల్పించిన నాటి నుండి ఆర్టీసీ బస్సులో వింతలు విచిత్రాలు చూస్తున్నాం.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళల కోసం ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం అమలు నాటి నుంచి బస్సుల్లో సీట్ల కోసం మహిళల కొట్లాటలు, భార్యల సీట్ల కోసం భర్తల తన్నులాటలు చూశాం. ఇటీవలే ఓ మహిళ బస్సులో సీటు దొరకలేదని ఏకంగా డ్రైవర్ సీటునే ఆక్రమించింది. ఇలాంటి ఘటనలు తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఎన్నో జరిగాయి. ఈ ఘటనలకు సంబందించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. ఇప్పుడు ఇలాంటి ఘటనే మరొకటి వైరల్ అయ్యింది. ఆర్టీసీ బస్సులో ఓ మహిళ ఏకంగా కూరగాయల వ్యాపారమే మొదలు పెట్టింది.

ఓ పల్లె నుంచి మొదలైన ఆర్టీసీ బస్సులో.. బస్సు నిండా ప్రయాణికులతో ప్రయాణం సజావుగా సాగుతోంది. మార్గమధ్యంలో ఓ కూరగాయలు అమ్మే మహిళ బుట్టలో కూరగాయలతో బస్సు ఎక్కింది. ఇది చూసిన మహిళలు ఆమె చుట్టూ చేరి అడగడంతో బస్సులోనే దుకాణం తెరిచింది. అడిగిన మహిళలకు అక్కడే తూకం వేసి కూరగాయలు అమ్మడం మొదలు పెట్టింది. దీనిని అదే బస్సులో వెళుతున్న ఓ ప్రయాణికులు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీంతో ఈ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కొద్ది రోజుల్లో బస్సుల్లో క్యాంటీన్లు కూడా ఓపెన్ చేస్తారేమో అని, ఏది ఏమైనా మహిళకు మంచి గిరాకీ తగిలిందని, ఈ ఫ్రీ బస్సు కొనసాగినంత కాలం ఆర్టీసీ బస్సుల్లో ఇంకెన్ని విచిత్రాలు చూడాల్సి వస్తుందోనని పలు రకాల కామెంట్లు పెడుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com