బీడీ కార్మికులకు 4 వేల జీవన భృతి అమలు చేయాలి
బీడీ కార్మికులందరికీ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రకటించిన ప్రకారం 4000 వేల రూపాయల జీవన భృతి వెంటనే అమలు చేయాలని ఐఎఫ్టియూ రాష్ట్ర అధ్యక్షులు ఐ.కృష్ణ డిమాండ్ చేశారు. శుక్రవారం ఐఎఫ్టియూ ఆధ్వర్యంలో జిల్లాలోని బీడీ కార్మికులతో కలిసి జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, అనంతరం కలెక్టర్ కు మెమోరండం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణ కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ బీడీ పరిశ్రమ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, కార్మికులకు ఉపాధి కల్పించాలని పక్షంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జీవనభృతి ఇచ్చి ఆదుకోవాలన్నారు. గత సర్కార్ సీఎం కేసీఆర్ అనేక ఆంక్షలు విధించి, కార్మికులకు తీవ్ర ఇబ్బంది కలిగించిందని తెలిపారు. బీడీ పరిశ్రమను దెబ్బతీయడానికి నరేంద్ర మోడీ ప్రభుత్వం రకరకాల చర్యలను చేపట్టి, సిగిరేటు కంపెనీలకు ఊడిగం చేస్తుందన్నారు. మోడీ ఎన్నికల్లో ఉపాధి భద్రత, స్వదేశీ పరిశ్రమల పరిరక్షణ, ప్రతి ఏటా రెండు కోట్ల కొలువులు ఇస్తామని వాగ్దానాలు చేసి, కార్మిక వ్యతిరేక విధానాలతో కార్పొరేట్ కంపెనీలకు సేవ చేసిందని తెలిపారు.
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను మోడీ ప్రభుత్వం తీసుకొచ్చి, కార్మిక హక్కులను కాల రాస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ కార్మికుల మధ్య మత వివాదాన్ని సృష్టిస్తోందని మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయడం సాధ్యం కాదని తీర్మానం చేయాలని ఆయన రేవంత్ రెడ్డికి, ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పీఎఫ్, ఈఎస్ఐ చట్టాలను కార్మికులకు వర్తింప చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్. భూమేశ్వర్, అధ్యక్షులు భూమన్న, ప్రధాన కార్యదర్శి సూర్య శివాజీ, యూనియన్ జిల్లా అధ్యక్షులు మందడి మణమ్మ, సిద్దిపేట జిల్లా నాయకులు తడక లచ్చయ్య, పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కూతాటి రాణ ప్రతాప్, పీడీఎస్యూ జిల్లా ఉపాధ్యక్షులు రవితేజ, పెద్ద ఎత్తున బీడీ కార్మికులు పాల్గొన్నారు.