ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి వ్యాఖ్యలపై కేయూ బీఆర్‌ఎస్వీ నాయకుల మండిపాటు

0

హనుమకొండ చౌరస్తా : యూనివర్సిటీ భూముల్లో ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ ఏర్పాటు విషయంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అనాలోచితంగా నిర్ణయం తీసుకుని విద్యార్థి విభాగంపై ఆ నెపాన్ని మోపడం శోఛనీయమని కేయూ బీఆర్‌ఎస్వీ నాయకులు ఆరోపించారు.

కేయూ గెస్ట్‌హౌజ్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో నాయకులు ఇన్‌చార్జి జెట్టి రాజేందర్‌, యూనివర్సిటీ రాష్ర్ట నాయకులు కత్తెరపల్లి దామోదర్‌, కొమురయ్య మాట్లాడారు. యూనివర్సిటీ భూమిలో పాఠశాల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నది ఒక్క బీఆర్‌ఎస్ అనుబంధమైన బీఆర్‌ఎస్వీ అని స్పష్టం చేశారు. మిగతా అన్ని విద్యార్థి సంఘాలు దీనికి మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు. విద్యార్థి సమస్యలపై నిరంతరం పోరాడుతున్న విద్యార్థి సంఘం ప్రస్థావాన్ని అసెంబ్లీ వేదికగా వక్రీకరించడం సిగ్గుచేటు అన్నారు.

బీఆర్‌ఎస్వీ విద్యా సంస్థలకు వ్యతిరేకం కాదని, ఇంటిగ్రేటెడ్‌ పాఠశాల నిర్మాణాన్ని స్వాగతిస్తామని కానీ దానికి యూనివర్సిటీ భూమిని త్యాగం చేయడం అంగీకరించబోమని స్పష్టం చేశారు. భవిష్యత్తు తరాల విద్యార్థుల అవసరాల కోసం యూనివర్సిటీ భూములను కాపాడటం తమ బాధ్యతని వెల్లడించారు. హనుమకొండ పరిసర ప్రాంతాల్లో ప్రభుత్వ భూములు లేవని చెప్పడం వాస్తవ విరుద్ధమని బీఆర్‌ఎస్వీ నాయకులు స్పష్టం చేశారు.

ప్రభుత్వం గానీ, స్థానిక ఎమ్మెల్యే గానీ యూనివర్సిటీపై పెత్తనం చెలాయించే హక్కు ఎవరికీ లేదని అన్నారు. సమావేశంలో జిల్లా కో ఆర్డినేటర్లు రాకేష్‌యాదవ్‌, పిల్లల నాగరాజు, ముస్కే రాము, గొల్లపల్లి వీరు, పస్తం అనిల్‌, కోరాపెల్లి రాజేష్‌ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com