అప్పుల బాధ.. భర్త వేధింపులు తాళలేక ఉపాధ్యాయురాలు ఆత్మహత్య..!

0

అప్పుల బాధ, భర్త వేధింపులు తాళలేక ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన కోరుట్లలో విషాదాన్ని నింపింది. ఎస్ఐ చిరంజీవి, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వంగ శ్రీధర్ బట్టల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. ఆయన భార్య రమ్య సుధ (36) వరంగల్ జిల్లాలోని రాయపర్తి ప్రభుత్వ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలు. సంక్రాంతి సెలవులు కావడంతో రమ్య సుధ శనివారం కోరుట్లలోని తమ ఇంటికి వచ్చింది. అయితే.. భర్త శ్రీధర్ వ్యాపారం సాఫీగా జరుగకపోవడంతో ఆర్ధికంగా ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నాడు.

ఇంటి కోసం తీసుకున్న అప్పులకు తోడు వ్యక్తిగతంగా తీసుకున్న అప్పులు పేరుకుపోయాయి. దీంతో రమ్య సుధ జీతం డబ్బులపైనే ఆధారపడి కుటుంబాన్ని వెల్లదీస్తున్నారిద్దరూ. బ్యాంకు రుణాలు, ఇతరాత్రాల నుంచి తీసుకున్న అప్పులకు రమ్య ష్యూరిటీగా ఉండడంతో ఆమెపై ఒత్తిడి పెరిగింది. అప్పులు చెల్లించే విషయంలో భార్యాభర్తల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. సోమవారం కూడా ఇరువురి మధ్య ఇదే విషయమై వాగ్వాదం జరిగింది. దాంతో, తీవ్ర మనస్థాపానికి గురైనా రమ్య సుధ తన ఇద్దరు కుమారులను ఆడుకోవడానికి బయటకు పంపించి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అల్లుడు శ్రీధర్‌ బలవంతంగా తన కూతురుతో అప్పులు చేయించి ఆమె ఆత్మహత్యకు కారకుడయ్యాడని మృతురాలి తండ్రి రఘురామ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com