బ్రిటిష్‌ పాలనకంటే ఎక్కువగా రాచరిక పాలన.. మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌

0

మంథనిలో బ్రిటిష్‌ పాలనకంటే ఎక్కువగా రాచరిక పాలన కొనసాగుతున్నదని, 80 శాతానికి పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీల ఓట్ల ద్వారా అధికారంలోకి వస్తున్న దుద్దిళ్ల కుటుంబం ఏనాడు ఈ ప్రాంత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని, దానికి ప్రతిఫలంగా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు పూరి గుడిసెల్లో పేదరికంతో జీవనం కొనసాగిస్తున్నారంటూ మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్‌ పేర్కొన్నారు. స్థానిక రాజగృహలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరలు సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ ప్రాంత ప్రజల ఓట్లతో దాదాపు 40 ఏళ్లుగా అధికారంలో ఉన్న దుద్దిళ్ల కుటుంబం ఈ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదన్నారు. ఇంకా ఇక్కడి ప్రజలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నారంటే అది కేవలం దుద్దిళ్ల కుటుంబం పాలన వల్లేనన్నారు. ఓట్ల సమయంలో నోట్ల కట్టలతో వచ్చి దొంగ హామీలు ఇస్తూ అధికారంలోకి వస్తున్న దుద్దిళ్ల శ్రీధర్‌ ప్రజలకు ఖచ్చితంగా పని చేయాలని తాము పోరాటం చేస్తున్నామన్నారు. ఆయన చెప్పిన హామీలను అమలు చేయించడంతో పాటు ప్రజలకు అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందేలా తాము పోరాటం చేస్తున్నారు. అభివృద్ధి గురించి తాము ప్రశ్నిస్తే జీర్ణించుకోలేని మంత్రి శ్రీధర్‌ ఆ పార్టీలో ఉన్న నా సామాజిక వర్గానికి చెందిన రజకులతో, గౌడ్స్​‍, ఎస్సీ, బీసీలతో తనను, తన కుటుంబాన్ని సోషల్‌ మీడియాను వేదికగా చేసుకోని దుర్భాషలాడుతున్నాడన్నారు.

ఆడవారు అని కూడ చూడకుండా ఇష్టం వచ్చినట్లు నా కుటుంబ సభ్యుల గురించి మాట్లాడించడం నిజంగా బాధకరమన్నారు. ఎందుకు తనపై ఇంత కక్ష్యగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదని.. ఇంకా ఎన్ని కుట్రలు చేస్తారో తెలియడం లేదన్నారు. కేవలం నేను పేదలకు సేవ చేసినందుకా లేకా.. ఆడ బిడ్డలకు పెండ్లిళ్లు చేసి, పేదలకు బిడ్డలకు చదువు చెప్పినందుకా అని ప్రశ్నించారు. తనపై తన పార్టీలో ఉన్న నా సామాజిక వర్గానికి చెందని బీసీ, ఎస్సీ, ఎస్టీలతో తిట్టిపిస్తే తాను నేరుగా శ్రీధర్‌, దుద్దిళ్ల కుటుంబాన్నే తిడుతున్నానన్నారు. ఇది అర్థం చేసుకోని కొంత షోకాల్డ్​‍ బ్రాహ్మణ సంఘాల నాయకులు హైదరాబాద్‌లోని సోషల్‌ మీడియాలో తనపై పోస్టులు పెడుతున్నారన్నారు. తాను బ్రాహ్మణ సంఘానికి ఎప్పుడు వ్యతిరేకంగా కాదని, బ్రాహ్మణ సంఘాన్ని ఏనాడు తిట్టలేదన్నారు. తమతో కూడా అనేక బ్రాహ్మణ సంఘాలు కలిసి పని చేస్తున్నాయన్నారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన దుద్దిళ్ల కుటుంబం, శ్రీధర్‌ ఈ నియోజకవర్గాన్ని ఇంకా చీకట్లో ఎందుకు ఉంచుతున్నారని ప్రశ్నించారు.

తనపై పోస్టులు పెట్టిన షోకాల్డ్​‍ బ్రాహ్మణ సంఘం నాయకులు మంత్రి శ్రీధర్‌ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడిచిందని ఈ కాలంలో మంథని నియోజకవర్గానికి ఎన్ని కంపెనీలు తీసుకు వచ్చాడని, ఎంత మందికి ఉద్యోగాలు పెట్టించాడని, ఎంత అభివృద్ధి చేశాడనే ఆంశాలను చెప్పాలని డిమాండ్‌ చేశారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తున్న తనపై కాంగ్రెస్ నాయకులు సోషల్‌ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టిస్తున్న మంత్రి శ్రీధర్‌ను షోకాల్డ్​‍ బ్రాహ్మణ సంఘాలే కంట్రోల్‌ చేయాలన్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా మమ్మల్ని భయపెట్టాలని సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే భయపడే ప్రసక్తే లేదన్నారు.

ఈ ప్రాంత ప్రజల కన్నీళ్లు తుడిచేందుకు దుద్దిళ్ల శ్రీధర్‌ మెడలు వంచే వరకు పోరాటం చేస్తామన్నారు. తనను, తన కుటుంబంపై సోషల్‌ మీడియాలో పెట్టిన పోస్టులపై రాష్ట్ర డీజీపీ, సీపీ, ఎస్పీలకు రిజిష్టర్‌ పోస్టు ద్వారా ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మంథని నియోజకవర్గంలో అశాంతిని నెలకొల్పేందుకు దుద్దిళ్ల శ్రీధర్‌ ప్రయత్నం చేస్తున్నాడని, ఏ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మంత్రి పదవీలో కొనసాగుతున్నాడో ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచి అశాంతికి కారణమవుతున్నాడన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్‌ నాయకులు ఎగోలపు శంకర్‌గౌడ్‌, తగరం శంకర్‌లాల్‌, పూదరి సత్యనారాయణగౌడ్‌, మాచీడి రాజుగౌడ్‌, ఆరెపల్లి కుమార్‌, పుప్పాల తిరుపతి, గుజ్జుల రాజిరెడ్డి, ఆకుల రాజబాబు, ముత్తారం సర్పంచ్‌ సుధాటి రవీందర్‌, నాయకులు ఆసీఫ్‌, పిల్లి సత్తయ్య, ఇర్ఫాన్‌, రవి, సంపత్‌లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

WP2Social Auto Publish Powered By : XYZScripts.com