పరిసరాల పరిశుభ్రతతో సీజనల్ వ్యాధుల వ్యాప్తి నివారణ
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే సీజనల్ వ్యాధుల వ్యాప్తిని అడ్డుకట్ట వేయవచ్చని, పారిశుధ్య నిర్వహణను అత్యధిక ప్రాధాన్యతతో స్థానిక సంస్థలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ చర్యలపై స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జె.అరుణ శ్రీ తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్షించారు. జిల్లాలో సీజనల్ వ్యాధులు నమోదు కావడానికి గల కారణాలు, సీజనల్ వ్యాధుల వ్యాప్తి అరికట్టేందుకు గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో చేపట్టిన చర్యలు మొదలగు వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం వన మహోత్సవం కార్యక్రమంపై కలెక్టర్ సమీక్షిస్తూ గ్రామాలలో మొక్కల పెంపకం లక్ష్యాలు, ఎక్కడ నాటుతున్నారు, అవెన్యూ ప్లాంటేషన్ మొక్కల లెక్క పక్కాగా ఉండాలని, అవెన్యూ ప్లాంటేషన్ లో మీటర్న్నర కంటే ఎత్తైన మొక్కలను ప్లాంటేషన్ చేయాలని అన్నారు. ప్రతి మండలంలో 2 నుంచి 5 ఎకరాల ఓపెన్ స్థలాలలో మొక్కలు నాటాలని, మొక్కలు నాటే ముందు, ఆ మొక్కలు నాటిన తర్వాత ఫొటోలు తీయాలని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి బి.గంగయ్య, జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్, జెడ్పీ సీఈఓ నరేందర్, ఎంపీడీఓలు, ప్రత్యేక అధికారులు, వైద్య అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.