కరీంనగర్ రుణం తీర్చుకుంటా
తాను బతికినన్నాళ్లు ఒకే పార్టీ… ఒకే సిద్ధాంతంతో పనిచేస్తూ ధర్మ రక్షణే ధ్యేయంగా, పేదల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేస్తానని, అందుకోసం ఎందాకైనా పోరాడతానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఉద్ఘాటించారు. గతంలో గుండెపోటు రావడంతో ఎన్ని షాక్ లు ఇచ్చినా స్ప్రహ రాకపోవడంతో తాను చనిపోయానని డాక్టర్లు చెప్పినా మహాశక్తి అమ్మవారి దయవల్ల బతికానన్నారు. తనకు లభించిన ఈ పునర్జన్మను ప్రజలకే అంకితం చేశానని చెప్పారు. కేంద్ర హోం సహాయ మంత్రి పదవిని బాధ్యతగా భావిస్తున్నానని, కరీంనగర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయేలా పనులు చేస్తానని ప్రకటించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరువాత కరీంనగర్ లో తాను పుట్టి పెరిగిన కాపువాడకు తొలిసారి విచ్చేసిన బండి సంజయ్ కుమార్ కు మున్నూరు కాపులు ఘన స్వాగతం పలికారు. కాపువాడలోని ప్రతి గడప వద్ద ప్రజలు బండి సంజయ్ కు పూలతో స్వాగతం పలికారు. తమవద్దకు రావడంపట్ల బాణా సంచా పేల్చి సంతోషం వ్యక్తం చేశారు. బండి సంజయ్ తో కలిసి దాదాపు కిలోమీటర్ మేరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కాపువాడలోని మున్నూరుకాపు కుటుంబాలన్నీ చందాలు వేసుకుని తొలిసారి తమవద్దకు వచ్చిన బండి సంజయ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి గుగ్గిళ్ల రమేశ్, రాధాక్రిష్ణ, రామచంద్రం, రాజేశ్ తదితరులు హాజరై సంజయ్ కాపువాడలో గడిపిన క్షణాలను, చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ ప్రజల కోసం నిరంతరం పనిచేసే ఏకైక నాయకుడు బండి సంజయ్ అంటూ పేర్కొన్నారు. అనంతరం బండి సంజయ్ ప్రసంగించారు. కేంద్ర మంత్రిగా ఉంటూ ఏదో ఒకటి సాధించి తీరుతానని, కరీంనగర్ ను అభివృద్ధి చేస్తానన్నారు. తాను ఉన్నా లేకున్నా మంచి పనులు చేస్తానన్నారు. బతికినన్నాళ్లు ధైర్యంగా, నిజాయితీగా ఉండి పోరాడి, ప్రజల మనసుల్లో నిలిచిపోయేలా పనిచేస్తానన్నారు.
కాపువాడలో పుట్టిన బిడ్డను అని కాపువాడను తాను మరిస్తే…తనని తానే మోసం చేసుకున్నట్లేనన్నారు. ఇక్కడికి కేంద్ర మంత్రిగా రాలేదని, తన ఇంటికి వచ్చిన రాజకీయ జీవితమిచ్చిన కాపు వాడకు వచ్చామన్నారు. అర్బన్ బ్యాంకు డైరెక్టర్ గా తొలిసారి ఇక్కడి నుండే పోటీ చేసి గెలిచినన్నారు. తనపై 109 కేసులు పెట్టినా భయపడలేదన్నారు. తనను క్రిమినల్ గా మార్చాలనుకుంటే… ప్రధానమంత్రి మోదీ, అమిత్ షా తనని హోం శాఖ సహాయ మంత్రిని చేశారన్నారు. తనని కనిపెంచిన కాపువాడలో మొన్నటి ఎన్నికల్లో అత్యధిక ఓట్లు తమకే వేశారన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం, కేసీఆర్ నియంత పాలనకు వ్యతిరేకంగా 150 రోజులపాటు మండుటెండలో, చలిలో, వానలో 1600 కి.మీల దూరం పాదయాత్ర చేసినట్టు గుర్తు చేశారు. తనను ఎంత ఇబ్బంది పెట్టినా, హేళన చేసినా, ఆఫీస్ పై దాడి చేసినా, అర్ధరాత్రి ఇంట్లోకి పోలీసులు చొరబడి గుంజుకుపోయినా, అరెస్ట్ చేసినా, జైల్లో వేసినా భయపడలేదన్నారు. జనం కోసం పోరాడి ఈ స్థాయిలో ఉన్నానన్నారు. నిజాయితీగా ప్రజల కోసం పనిచేస్తే గుర్తింపు దానంతటదే వస్తుందని గుర్తుంచుకోవాలన్నారు. భాగ్యలక్ష్మీ ఆలయం వద్ద నా భార్యను చంపుతామన్న, కొడుకులను కిడ్నాప్ చేస్తామన్నా తాను భయపడలేదన్నారు. ఎంపీగా రోడ్ల కోసమే రూ.5 వేల కోట్లు తీసుకొచ్చానని, గత ప్రభుత్వం సహకరించి ఉంటే అత్యధిక నిధులు తీసుకొచ్చే వాడినన్నారు. ఇప్పుడు కేంద్ర మంత్రిగా రాబోయే ఐదేళ్లపాటు అధిక నిధులు తీసుకొచ్చే అవకాశం వచ్చిందన్నారు.