సీఎం రేవంత్ రెడ్డి తర్వాత నేనే… ఎవరికీ చెప్పుకుంటాడో చెప్పుకోమను… వైరల్ గా మారిన ఆడియో
నాకు వాడెవడో తెలియదు.. వాడితో ఏం కూడా కాదు ఎవరికి ఫిర్యాదు చేసుకుంటాడో చేసుకోమను… అంటూ పెగడపల్లి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మాట్లాడిన ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సదరు ఆడియో క్లిప్ లో మండల కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి పై పార్టీ అధ్యక్షుడు అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డాడు. ఇటీవల నిర్వహించిన పార్టీ కార్యక్రమానికి సంబంధించి రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో వైస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి పేరు రాయకపోవడంతో వివాదం తలెత్తినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఓ కాంగ్రెస్ లీడర్ పార్టీ ప్రెసిడెంట్ కు ఫోన్ చేసి అడగగా బూతు పురాణం అందుకున్నాడు. తనతో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పేరు జపం చేస్తేనే పేరు వస్తదని చెప్పు అంటూ మాట్లాడాడు. నేను చెప్తేనే వాడికి పదవి వచ్చింది… పని చేసేటోని పేర్లు మాత్రమే రాస్తా.. రేవంత్ రెడ్డి తర్వాత బుర్ర రామ గౌడ్ మాత్రమే ఉంటాడని చిందులు తొక్కాడు. కాంగ్రెస్ పార్టీలో సీఎం రేవంత్ రెడ్డి తర్వాత నేనే ఎక్కడ ఎవరికి ఫిర్యాదు చేసుకుంటాడో చేసుకోమను అవసరమైతే ఢిల్లీ వెళ్లమను అంటూ మాట్లాడిన ఆడియో క్లిప్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.