అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్..
దేవాలయాలే టార్గెట్‌గా దొంగతనాలు
దేవాలయాలే టార్గెట్ గా వరుస దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈమేరకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వేములవాడ రూరల్ మండలం ఫాసుల్ నగర్ లో నివాసముంటున్న హుస్నాబాద్ కి చెందిన శివరాత్రి సంపత్, అగ్రహారం కు చెందిన అల్లిపు పరుశురాంతో కలిసి ఎలాగైనా దొంగతనాలు చేసి డబ్బు సంపాదించుకోవాలనుకున్నారు.
దానికి దేవాలయాల్లో దొంగతనం చేద్దామని నిర్ణయించుకొని జిల్లాలోని తంగల్లపల్లి, ముస్తాబాద్, ఇల్లంతకుంట, చందుర్తి, వేములవాడ, బోయిన్ పల్లి మండలాలు, కరీంనగర్ జిల్లా హుస్నాబాద్, గంగాధర మండలాలు, జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం, సిద్దిపేట జిల్లాలో పలు మండలాల్లో ఎల్లమ్మ, పెద్దమ్మ, అంజన్న, లక్ష్మి నరసింహ స్వామి, రామాలయం ఇలా చాలా దేవాలయాల్లో వరస దొంగతనాలకు పాల్పడ్డారు. సిరిసిల్ల డీఎస్పీ ఆధ్వర్యంలో రూరల్ సీఐ, ఇళ్లంతకుంట ఎస్ఐ, సిబ్బందితో స్పెషల్ టీమ్ ఏర్పడి, దర్యాప్తు చేపట్టగా సోమవారం పొత్తూరు బ్రిడ్జి వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద దొంగతనాలకు ఉపయోగించిన ఇనుప రాడ్, ఒక బైక్, రెండు మొబైల్ ఫోన్స్, 8 తులాల బంగారు, 2 తులాల వెండి ఆభరణాలు స్వాధీనపరచుకొని ఇద్దరు నిందితులను రిమాండ్ కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.
నిందితులపై జిల్లాలో 12 కేసులు, జగిత్యాల,కరీంనగర్, సిద్దిపేట జిల్లాలలో 4 కేసులు, మొత్తం 17 నమోదైనట్లు చెప్పారు. వరుస దొంగతలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన రూరల్ సీఐ మొగిలి, ఎస్ఐ శ్రీకాంత్, హెడ్ కానిస్టేబుల్ సత్యనారాయణ, కానిస్టేబుల్స్ మధు, చంద్రశేఖర్ లను ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ సమావేశంలో డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి, సీఐ మొగిలి, ఎస్ఐ శ్రీకాంత్ సిబ్బంది పాల్గొన్నారు.