ప్రజలందరికీ మెరుగైన వైద్యం అందించడమే లక్ష్యం
నియోజవర్గంలోని ప్రజలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామని, ఈ మేరకు పక్క ప్రణాళికతో ఏర్పాటు చేస్తున్నామని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ తెలిపారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తో కలిసి ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా దవాఖానలోని పలు వార్డులు, ప్రసూతి విభాగం, పాలియేటివ్ కేర్, మేల్ వార్డ్ లు తనిఖీ చేశారు. ఆయా వార్డుల్లో రోగులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు. పలువురు బాలింతలతో మాట్లాడారు. అనంతరం వైదులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. దవాఖానలో వైద్యుల, సిబ్బంది పోస్టుల వివరాలు తెలుసుకున్నారు. ఇంకా ఎందరు కావాలో ఆరా తీశారు. వేములవాడ ఏరియా ఆసుపత్రిలో కావాల్సిన వసతుల పై ఆరా తీసి, వాటికి కావాల్సిన వాటికి కావాల్సిన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సీటీ స్కాన్ యంత్రం వాడుతున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అడిగి తెలుసుకున్నారు. దానికి కావాల్సిన ఏర్పాట్లపై వివరాలు తీసుకున్నారు. పూర్తిస్థాయిలో సేవలు అందుబాటులో ఉన్నాయని విప్ స్పష్టం చేశారు. ప్రతి రోజూ ఎంత మంది రోగులు వస్తున్నారని? గత నెలలో మొత్తం ఎంత మంది వచ్చారు? ఇన్ పేషెంట్ ఎందరు అయ్యారు? క్యాంటీన్ నడుస్తున్నాదా? అని ఆరా తీశారు. ఈ సందర్భంగా పోస్ట్ మార్టం చేసేందుకు కేటాయించిన గదిని విప్, కలెక్టర్ పరిశీలించారు. పోస్ట్ మార్టం సేవలు త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు.
అనంతరం ఆది మాట్లాడుతూ నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి వచ్చే రోగులకు మెరుగైన సేవలు అందించేలా పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామని ప్రకటించారు. గైనకాలజిస్ట్, ఈఎన్ టీ, ఎముకల, జనరల్ సర్జన్ వైద్యుల సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఆర్థో డాక్టర్ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని పూర్తిస్థాయిలో ఆపరేషన్లు కూడా చేస్తారని స్పష్టం చేశారు. నియోజకవర్గంలోని ప్రజలందరూ వేములవాడ ఏరియా ఆసుపత్రిలో అందిస్తున్న సేవలు సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. పాలియేటివ్ కేర్ లో చికిత్స పొందుతున్న కోనరావుపేటకు చెందిన ఆడేపు చంద్రమౌళి, కనగర్తికి చెందిన ఈగ ముకుందంతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. వారికి ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని, వారికి కావాల్సిన పూర్తి వైద్యం అందించేందుకు ఏర్పాట్లు చేయాలని విప్ సూచించారు. వారి వెంట ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, డీఎంహెచ్ఓ వసంతరావు, డీసీహెచ్ఎస్ పెంచలయ్య, ఇంచార్జ్ సూపరింటెండెంట్ సంతోష్ చారి, డాక్టర్లు ప్రవీణ్, శ్రీనివాస్, వేములవాడ అర్బన్ మండల తహసీల్దార్ మహేష్ కుమార్, వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ , వైద్య సిబ్బంది తదితరులు ఉన్నారు.