మా భార్యలను కాపురానికి పంపండి.. కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల దీక్ష..
తమ భార్యలను కాపురానికి పంపాలంటూ.. అత్తింటికి వెళ్లే అల్లుళ్లను చూశాం.. మరీ అయితే.. నలుగురిని పిలిచి పంచాయితీ పెట్టే వారు లేకపోలేదు.. అయితే, ఓ ఇద్దరు అల్లుళ్లు మాత్రం.. ఏకంగా కలెక్టరేట్ వద్దే ఆందోళనకు దిగారు.. తమ భార్యలను కాపురానికి పంపండి అంటూ.. టెంట్ వేసి రిలే నిరాహారదీక్షలు చేపట్టారు.. అంతేకాదు.. తమ భార్యలను కాపురానికి పంపకుండా అడ్డుపడుతున్న మామపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏలూరు కలెక్టరేట్ వద్ద ఇద్దరు అల్లుళ్ల రిలే నిరాహారదీక్ష ఆసక్తికరంగా మారింది..
తమ మామ అయ్యంగార్ ఇద్దరు కూతుళ్లను కాపురానికి పంపకుండా.. తమను వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ అల్లుళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భార్యలను ఇంటి వద్ద ఉంచుకుని.. తిరిగి తమపైనే కేసులు పెడుతున్న మామపై చర్యలు తీసుకుని.. తమకు న్యాయం చేయాలంటూ అల్లుళ్లు వి. పవన్, పీబీ శేషసాయి డిమాండ్ చేస్తున్నారు.
మా సమస్యను జాయింట్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు పవన్.. ఆయన ఎస్పీని కలవమని సూచించారు.. ఎస్పీ గారు డీఎస్పీగారికి చెప్పారు.. కానీ, మా మయ్య నా భార్యను కాపురానికి పంపించడం లేదు.. నా కూతురును చూపించడం లేదు.. ఫోన్ చేసినా ఉపయోగం లేకుండా పోయింది.. చిన్నపాపకు నాపై నెగిటివ్‌గా చెబుతున్నారు.. బర్త్‌డే విషెస్ చెప్పినా.. నెగిటివ్ ఆడియో మెసేజ్‌లు పెట్టిస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.. నాకు వేరే దారిలేకే.. ఇలా దీక్షకు దిగినట్టు చెబుతున్నారు పవన్..
కలెక్టరేట్‌కు ఎదురుగా ఓ టెంట్ వేసిన పవన్, శేషసాయి.. అందులోనే రిలే నిరాహార దీక్షకు దిగారు.. ఇక, తమ డిమాండ్లతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు..
* మా భార్యలను కాపురానికి పంపించాలి..
* కన్న కూతురిని తండ్రికి చూపించాలి..
* కూతుళ్లను కాపురానికి పంపించకుండా అల్లుళ్లపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి..
* శాడిస్ట్ మామయ్య బీకే శ్రీనివాస రామానుజ అయ్యంగర్‌పై చర్యలు తీసుకోవాలి.. ఇట్లు మోసపోయిన అల్లుళ్లు అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు..